భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను విస్తృతం గా ప్రచారం చేయడం కోసం స్థాపించిన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీతా ఫౌండేషన్. ప్రతి ఏటా ఘనం గా నిర్వహిస్తున్నట్టే ఈ సారి కూడా భగవద్గీతా ఫౌండేషన్ - గీత జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ టి వి చానెల్స్ TV 5, హిందూ ధర్మం ప్రత్యక్ష ప్రసారం చేయగా - ప్రపంచవ్యాప్తం గా లక్షలాదిమంది గీతా బంధువులు వీక్షించి ఆనందాన్నీ, స్ఫూర్తినీ పొందారు. డిసెంబర్ 8 వ తేదీ, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ముందుగా వత్స తో కూడిన గోవు కు పూజ చేసి, అటుపై గీతా రథం పై శ్రీకృష్ణుడు, అర్జునుడు సుప్రతిష్టులై ఉండగా, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జెండా ఊపి గీతా రథ యాత్ర ను ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు,యువకులు- జై శ్రీ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుమ్, జై భగవద్గీతా నినాదాలతో రథ యాత్రలో పాల్గొన్నారు. అటుపై గీతా జయంతి వేడుకల సభ టివీ 5 స్టూడియో సెట్ లో ప్రారంభమయ్యింది. తొలుత శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి జ్యోతి ప్రకాశనం గావించారు. అటుపై ఘనా ఘన సుందరా అంటూ కృష్ణప్రార్థన చేసి - దశాబ్ద కాలం లో, గీతా ప్రచారం లో 'భగవద్గీతా ఫౌండేషన్' సాధించిన ప్రగతి నివేదికను సమర్పిస్తూ, భగవద్గీత గొప్పతనం గురించి స్ఫూర్తి దాయకం గా తన గాన ప్రసంగం ద్వారా వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డలకు బాల్యదశ నుండే భగవద్గీత నేర్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు భగవద్గీత ను పాఠ్యాంశంగా చేర్చాలనీ, కేంద్ర ప్రభుత్వం భగవద్గీత ను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని గంగాధర శాస్త్రి కోరారు. అంతే కాక - భగవద్గీత మతాలకు, దేశ, కాల, జాత్యాదులకు అతీతమైన జ్ఞాన బోధ కాబట్టి భగవద్గీత బోధించిన దినాన్ని "international wisdom day" గా ప్రకటించాలని సూచించారు. భగవద్గీత పట్ల సాధారణ ప్రజలలో వీలైనంత అవగాహన కలిగించే ప్రయత్నం చేశామనీ, వ్యక్తుల మరణ ప్రదేశాలలోనూ, శవ యాత్ర వాహనాలలోనూ భగవద్గీతను ప్రదర్శించడాన్ని సాధ్యమైనంతగా అరికట్టగలిగామనీ గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న గీతా ప్రచారాన్ని యూట్యూబ్ ద్వారా ఇప్పటివరకూ 20 లక్షలమందికి పైగా ప్రేక్షకులు వీక్షించారనీ... పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో గీత ద్వారా వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలతో విద్యార్థులకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగించామనీ,
ప్రపంచ వ్యాప్తం గా అనేక దేవాలయాలలోనూ, ఇంకా ఇతర సందర్భాలలో భగవద్గీతను ప్రచారం చేయగలిగామని గంగాధర శాస్త్రి వివరించారు.
ఒక దశాబ్దం పాటు పరిశోధనాత్మక కృషి చేసి తాము రూపొందించిన సంగీతభరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతకు ప్రపంచ వ్యాప్తం గా విశేషమైన ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం భగవద్గీతను ఆంగ్ల తాత్పర్యంతో రూపొందిస్తున్నామని, త్వరలో దీనిని అమెరికా అధ్యక్షుడి చేతులమీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా హిందీ, గుజరాతి, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో భగవద్గీతను వెలువరించేందుకు 'భగవద్గీతా ఫౌండేషన్' యోచన చేస్తోందని, సర్వజన హితం గా గీతను బోధించిన గీతాచార్యుడికి 'గుడి' ని, ఆయన బోధించిన భగవద్గీతకు 'బడి' ని 18 ఎకరాలలో నిర్మించాలని, తద్వారా గీతా ప్రచారాన్ని విస్తృతం చేయడం కోసం భగవద్గీతా ఫౌండేషన్ సంకల్పించిందనీ గంగాధర శాస్త్రి అన్నారు.
'గీతాజయంతి' సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ - 'గీతాచార్య' పురస్కారాన్ని రిటైర్డ్ డీజీపీ శ్రీ కరణం అరవింద రావు కు, 'పార్థ' పురస్కారాన్ని చిII వలివేరు సాయి శ్రీకర్ కు అందించింది. ఈ సందర్భం గా విశిష్ట అతిధులు గా విచ్చేసి, గీతా సందేశం అందించిన శ్రీ వి వి లక్ష్మీనారాయణ-జనసేన నాయకులు, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS, శ్రీమతి 'భారతీయం' సత్యవాణి, టీవీ 5 చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు లను ఫౌండేషన్ సత్కరించింది. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి గీతాచార్యుడికి మహా హారతి ఇచ్చి అనుగ్రహ భాషణం చేశారు.
కార్యక్రమాన్ని భావగంభీరమైన వ్యాఖ్యానం తో ధీ శ్రీనివాస్ నిర్వహించారు.
'బాహుబలి' చిత్రం ఫేమ్ శ్రీమతి ఆశ్రిత వేముగంటి శ్రీకృష్ణుడిని స్వాగతిస్తూ చేసిన నృత్యం అలరించింది.
ఈ కార్యక్రమానికి శ్రీ ఘంటా అజాద్ బాబు సమన్వయ కర్త గా వ్యవహరించారు. శ్రీ సరస్వతి చలపతి రాజు, శ్రీ సతీష్ లు పర్యవేక్షించారు.
అనంతరం గీతా ఫల శృతి ( యత్ర యోగేశ్వరః కృష్ణో 18-78) శ్లోకం తో, శాంతి మంత్రాలతో గీతా జయతి వేడుకలను మంగళప్రదం గా ముగించారు.