'భగవద్గీతా ఫౌండేషన్' అనే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థను స్థాపించి స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీతా ప్రచారమే ధ్యేయం గా తన జీవితాన్ని మలుచుకున్న గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ఆయన గానం చేసిన తెలుగు తాత్పర్య సహిత భగవద్గీత, ప్రసంగ వీడియోలు ప్రపంచ వ్యాప్తం గా ఉన్న తెలుగు వారికి స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయం లో శ్రీయుతులు గంగాధర శాస్త్రి గారి భగవద్గీతా వీడియోలు తమకు ఎంతో ఊరటను, శాంతిని, భవిష్యత్తు పట్ల ఆశను, ఉత్సాహాన్ని కలిగించాయని చెబుతూ శ్రీ సోము ప్రసన్నకుమార్ రెడ్డి బంధు మిత్ర సపరివార సమేతం గా భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసి శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించి ఆయనతో కాసేపు గడిపారు. భగవద్గీత ను బాల్యదశ నుంచే విద్యార్థులకు నేర్పించవలసి ఉన్నదని, దీనిని ఒక వర్గానికి చెందిన మత గ్రంథం గా కాక ఉత్తమ జీవన విధాన మార్గదర్శి అయిన జ్ఞాన గ్రంథం గా చూడవలసిఉన్నదని గంగాధర శాస్త్రి అన్నారు. తాము రూపొందించిన సంగీత భరిత భగవద్గీతను కొత్త సంవత్సరం శుభారంభ సందర్భాలలో బహుమతి గానూ, సంస్థల వ్యవస్థాపక దిన శుభసందర్భాలలోనూ, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, షష్టి పూర్తి వంటి శుభకార్యాలయాలలోనూ, పదవీ ప్రమాణ స్వీకారం, పదవీవిరమణ సందర్భాలలో నూ కానుకగా ఇవ్వాలని సూచించారు. సమీప దేవాలయాలకు కానుకగా ఇచ్చి అక్కడ వినిపించేట్టు చూడవలసిఉందని అన్నారు. మొబైల్స్ లో కాలర్ ట్యూన్స్ గానూ, రింగ్ టోన్స్ గానూ గీతా శ్లోకాలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిమ్స్ లో వ్యాయామం చేస్తూ గీతను విండడం ద్వారా శారీరిక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని గంగాధర శాస్త్రి సూచించారు. భగవద్గీత ఫౌండేషన్ ద్వారా భగవద్గీతను ప్రచారం చేయడం లో తాను ప్రధాన పోషిస్తానని ప్రసన్న కుమార్ అన్నారు..